English | Telugu

నానితో మ‌రోసారి గాంధీ!?

మొద‌టి సినిమాతోనే మెమ‌ర‌బుల్ హిట్ ని అందుకున్న తెలుగు ద‌ర్శ‌కుల్లో మేర్ల‌పాక గాంధీ ఒక‌రు. 2013లో సందీప్ కిష‌న్, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా రూపొందిన‌ `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్`తో గాంధీ ద‌ర్శ‌క‌ప్ర‌స్థానం మొద‌లైంది. ఆపై రెండో చిత్రం `ఎక్స్ ప్రెస్ రాజా` (2016)తోనూ ఇంప్రెస్ చేశాడు మేర్ల‌పాక‌. శ‌ర్వానంద్, సుర‌భి కాంబోలో వ‌చ్చిన స‌ద‌రు చిత్రం డీసెంట్ హిట్ అనిపించుకుంది. అయితే, మూడో చిత్రంగా మంచి అంచ‌నాల న‌డుమ విడుద‌లైన 2018 నాటి `కృష్ణార్జున యుద్ధం` (నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్) మాత్రం నిరాశ‌ప‌రిచింది. అలాగే, గ‌త ఏడాది ఓటీటీలో నేరుగా స్ట్రీమ్ అయిన `మాస్ట్రో` (నితిన్, త‌మ‌న్నా, న‌భా న‌టేశ్) కూడా ఆశించిన స్థాయిలో అల‌రించలేక‌పోయింది.

అయిన‌ప్ప‌టికీ మేర్ల‌పాక గాంధీకి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాన్ని తీర్చిదిద్దే అవకాశం ద‌క్కింద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `కృష్ణార్జున యుద్ధం`లో హీరోగా న‌టించిన నానితోనే మ‌రో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కింద‌ట మేర్ల‌పాక‌కి. అన్నీ కుదిరితే వ‌చ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళొచ్చ‌ని టాక్. త్వ‌ర‌లోనే నాని - మేర్ల‌పాక గాంధీ సెకండ్ జాయింట్ వెంచ‌ర్ పై క్లారిటీ రానుంది.

ఇదిలా ఉంటే, నాని ప్ర‌స్తుతం `ద‌స‌రా` చిత్రంతో బిజీగా ఉన్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ నాయిక‌గా న‌టిస్తోంది. ఈ ఏడాది క్రిస్మ‌స్ కి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంద‌ని స‌మాచారం.